ఏది రా నా బ్రతుకేది?
యాడ రా నే బ్రతికేది?
లేదు గా ఇంకా నా బ్రతుకు..!
చీకటిలో పెరుగుతోంది
వెలుగుని చూడనియ్యకుండా.. !
పుట్టేది ఆడబిడ్డ అంటూ చంపేసినారే..!
భారమయ్యే ఆడబిడ్డ మాకొద్దంటూ..!
పురిటిలోనే గొంతు నలిపేసినారే..!
పెంచితే కట్నం ఇవ్వలేమో,
పుట్టింది చెత్త అనుకుంటూ.. పడేసినారే!
సాగేజీవితం కష్టంగా ఉందంటూ..!
కాసులు కోసం అమ్మేసినారే.!
ఏది రా నా బ్రతుకేది..?
యాడ రా నే బ్రతికేది..?
లేదు గా ఇంకా నా బ్రతుకు.
మారినాడు రా మనిషి మారినాడు
పురిటి చావులను గెలిచి ఆడబిడ్డ పెరుగుతోందిరా..!
అది నవ్వేలోపే చదువు ఎందుకంటూ
బాల్యాన్ని పెళ్లితో నింపేసి నారే.. !
బోసి నవ్వులన్నీ కన్నీటిపాయే..!
ఏది రా నా బాల్యమేదిరా..?
లేదుగా ఇంకా నా బ్రతుకు..!
మారినడురా మనిషి మళ్ళీ మారినాడు
బాల్యం బడికి పోయినాదే..!
చక్కంగా చదివేను చదువుల తల్లి
ఆడబిడ్డకు చదువెందుకంటు
వంటింటి కప్పను చేసి పెళ్లి చేసినారే..!
కట్నం కోసం వాడు చంపేసినాడే అయ్యో పాపం చంపేసినాడే..!
ఏది రా నా చదువేదిరా..?
లేదుగా ఇంకా నా బ్రతుకు..?
మారినాడు రా మనిషి మళ్ళీ మారినాడు ఈసారి ఆలోచనే మారినాది రా..!
పురిటలో గెలిచిన బిడ్డని బాల్యంలో కామం పేరుతో కాటువేసినాడు.
బడిలో భయ్యం పేరుతో నలిపేసినాడు.
ఒంటరిగా ఉందని ఎత్తుకుపోయి కాంక్ష తీర్చుకొని నిప్పంటించినాడే....!
అయ్యయ్యో..!కన్న వాళ్లకు ఆఖరి చూపునైనా దక్కనియ్యలేదే..!
కాలిపోతున్నా మనసులకు
కన్నీళ్లు సమాధులుకడుతున్నాయి.
ఏది రా నా బ్రతుకేదిరా.?
కాల్చేసినావుగా ఇంకా నా బ్రతుకు.
మనిషి ఎంత మారితే ఏందిరా..!
జన్మస్థానాన్నే మరిచినాక...!
మార్పు రావాల్సింది చట్టం లో కాదు
పరిపాలనలో కాదు,
ప్రతి మనిషి ఆలోచన తీరు మారాలి.